: 'సహజీవనం' వద్దన్నందుకు ప్రియురాలిని నరికిన ప్రియుడు
అప్పటికే పెళ్లయిన ఓ యువకుడు మరో యువతితో సహజీవనం చేశాడు. అతనికి ముందే పెళ్లయిన విషయం తెలుసుకున్న ఆ యువతి ఇక ఉండలేనంటూ వెళ్లిపోయింది. ఆమెను విడిచి ఉండలేని యువకుడు తిరిగి రమ్మని కోరాడు. 'సహజీవనం' చేసేందుకు రానని స్పష్టం చేసిన యువతిపై కోపంతో కత్తితో దాడిచేసి చెయ్యి నరికాడు. ఈ ఘటన గుంటూరు పరిధిలోని నల్ల చెరువు ప్రాంతంలో ఈ తెల్లవారుఝామున జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, నల్ల చెరువు, 8వ లైనుకు చెందిన లక్ష్మి, చెందేటి వేణుగోపాల్ ఇద్దరూ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు. వీరు 10వ తరగతి నుంచీ కలసి చదువుతూ ఉండడంతో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆరు నెలల క్రితం వీరిద్దరూ శ్రీనివాసరావు తోటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం మొదలుపెట్టారు. కాగా, వేణుగోపాల్ కు అంతకుముందే వివాహం జరిగినట్టు తెలుసుకున్న లక్ష్మి గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. అతడిపై పోలీసు స్టేషనులో ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలో తెల్లవారుఝామున లక్ష్మీ ఇంటికి వచ్చిన వేణు కలసి ఉందామని, తిరిగి తనతో రావాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో దాడి చేశాడు. అతడిని దొంగగా భావించిన స్థానికుడు రఫీ పట్టుకునే ప్రయత్నం చేయగా, అతనిపైనా దాడి చేశాడు. స్థానికుల సాయంతో వీరిద్దరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.