: భానుడి ఎండ ప్రచండం... తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఒక్క రోజులో 225 మంది మృతి
భానుడు భగభగలాడుతున్నాడు. ఎంతగా అంటే, తన ప్రతాపానికి నిన్న ఒక్కరోజే 225 మందిని బలితీసుకునేంత! అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మే నెలలో అధిక వేడి సర్వసాధారణమే అయినా, గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదవుతోంది. గురువారం నాడు తెలంగాణలో అత్యధికంగా సూర్యాపేటలో 47. 5, రామగుండంలో 46.8, నిజామాబాద్ లో 46.6, హైదరాబాదులో 44.3 డిగ్రీల వేడి నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రెంటచింతలలో 47 డిగ్రీలు, గుంటూరులో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మండే ఎండలకు వడగాలులు తోడవడంతో, తెలంగాణలో 147 మంది చనిపోయారు. అత్యధికంగా కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో 31 మంది చొప్పున ప్రాణాలు విడిచారు. ఖమ్మం జిల్లాలో 27, వరంగల్ జిల్లాలో 23 మంది చనిపోయారు. ఏపీలో 78 మంది చనిపోగా, ప్రకాశం జిల్లాలోనే 36 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఎండలు మరో రెండు మూడు రోజులు ఇలాగే ఉంటాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.