: రాజధానికి వెళ్లే రైళ్లను 'రిజర్వేషన్లు' కావాలంటూ ఆపేశారు
రాజస్థాన్ లో గుజ్జర్లు మరోసారి ఆందోళన బాటపట్టారు. ఏడేళ్ల క్రితం గుజ్జర్ నాయకుడు కిరోరి సింగ్ బైంస్లా నేతృత్వంలో రిజర్వేషన్లు కావాలంటూ ఆందోళన చేపట్టి, రైళ్లను ఆపేసిన గుజ్జర్లు మరోసారి అలాంటి ఆందోళనకు దిగారు. 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తేనే ఆందోళన ఆపుతామని, లేని పక్షంలో ఢిల్లీ-ముంబై మార్గంలో రైళ్లను తిరగనిచ్చేది లేదని స్పష్టం చేశారు. గుజ్జర్లు భారీ సంఖ్యలో రైళ్లపై బైఠాయించడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. గుజ్జర్ నేత కిరోరి సింగ్ భైంస్లా మే 11న న్యాయయాత్ర పేరిట ఆందోళన ప్రారంభించారు. దీంతో మరోసారి గుజ్జర్లు రైలు మార్గంపై ఆందోళన ఉద్ధృతం చేశారు. వీరి ఆందోళనలు ఆగే సూచనలు కనిపించకపోవడంతో రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.