: వచ్చే ఐపీఎల్ వరకు టీమిండియా డైరీలో ఖాళీ లేదు!
ప్రస్తుతం ఐపీఎల్-8 నడుస్తోంది. ఆ టోర్నీ ముగిసిన వెంటనే టీమిండియా బంగ్లాదేశ్ వెళుతోంది. అక్కడి నుంచి 2016 ఐపీఎల్ సీజన్ వరకు భారత్ ముందు ఊపిరి సలపని షెడ్యూల్ నిలుస్తోంది. తొలుత ప్రారంభమయ్యే బంగ్లాదేశ్ టూర్లో టీమిండియా ఓ టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఆ టూర్ అనంతరం భారత్ జట్టు జింబాబ్వే పయనం కానుంది. ద్వైపాక్షిక పర్యటనల్లో భాగంగా జరిగే ఈ సిరీస్ లో భారత్ మూడు వన్డేలు, రెండు టి20 మ్యాచ్ లు ఆడనుంది. ఆ పర్యటన ముగియగానే ఆగస్టులో శ్రీలంక పర్యటన ఉంది. ఆ పర్యటనలో భాగంగా మనవాళ్లు మూడు టెస్టులు ఆడతారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు భారత్ వస్తుంది. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు జరిగే ఆ టూర్లో సఫారీలతో టీమిండియా నాలుగు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడుతుంది. అది ముగియగానే, అన్నింటికన్నా ముఖ్యమైన పాకిస్థాన్ తో సిరీస్ ఉండనుంది! డిసెంబర్ లో జరుగుతుందని భావిస్తున్న ఈ సిరీస్ పై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అటుపై, భారత జట్టు ఆస్ట్రేలియా పయనమవుతుంది. 2016 జనవరిలో కంగారూలతో ఐదు వన్డేలు, మూడు టి20 మ్యాచ్ లు ఆడుతుంది. ఇక, ఫిబ్రవరిలో శ్రీలంక జట్టు భారత్ వస్తుంది. మూడు టి20 మ్యాచ్ లు ఆడుతుంది. అనంతరం ఆసియా కప్ టి20 చాంపియన్ షిప్ జరుగుతుంది.