: మ్యాగీ నూడుల్స్ పై నిషేధం తప్పదా?
మ్యాగీ నూడిల్స్ పై నిషేధం పడనుందా? నూడుల్స్ తినడం ప్రమాదకరమా? అనే సందేహాలు దేశ వ్యాప్తంగా నెలకొన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మ్యాగీని తయారు చేసే నెస్లేపై చర్యలు తీసుకునే దిశగా కదులుతోంది. 2 లక్షల ప్యాకెట్లను మార్కెట్ల నుంచి ఉపసంహరించుకోవాలని ఆదేశించిన ఎఫ్ డీఏ, ఇతర బ్యాచ్ లను కూడా పరీక్షిస్తోంది. వాటిలో అనుమతించిన స్థాయి కంటే ఎక్కువ మోతాదులో సీసం, ఆహారంలో ఉపయోగించే రంగులు ఉన్నాయని తేలితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. మ్యాగీ నూడుల్స్ లో రుచిని పెంచేందుకు మోనో సోడియం గ్లూటామేట్ (ఎంఎస్ జీ) అనే రసాయనం, సీసం ఎక్కువ మోతాదులో ఉన్నట్టు ఎఫ్ డీఏ గుర్తించింది. ఆహార పదార్థాల్లో సీసం పరిమాణం కేవలం 2.5 పార్ట్స్ పర్ మిలియన్ (పీపీఎం) ఉండాలని, మ్యాగీలో దాని శాతం 17.2 పీపీఎంగా ఉందని తేల్చింది. ఇది అత్యంత ప్రమాదకరమని ఎఫ్ డీఏ స్పష్టం చేసింది.