: ఓ మైగాడ్... ఎస్వీ రంగారావు లెవల్లో డైలాగులు చెప్పారు!: సినీ నటుడు శివాజీ
అధికారంలో లేనప్పడు బీజేపీ నేతలు పోలవరంపై ఎస్వీ రంగారావు స్థాయిలో డైలాగులు చెప్పారని హీరో శివాజీ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక బీజేపీ నేతలు రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు మన జీవనాధారమని అన్నారు. స్వాతంత్ర్య పూర్వం ప్రారంభమైన ప్రాజెక్టు ఇంకా పూర్తికాలేదన్నారు. ఏపీలో కలవాల్సిన ముంపు మండలాలను కొన్నిటిని బీజేపీ నేతలు తెలంగాణలో కలిపేశారని మండిపడ్డారు. వీళ్లూ మనుషులేనా? అంటూ ప్రశ్నించారు. సంస్కారం ఏమైనా ఉందా? ప్రజల పట్ల విశ్వాసం ఉందా? ప్రత్యేక హోదా అక్కర్లేదంటారా? అని విరుచుకుపడ్డారు. ఏపీ నేతలకు ఉప్పుతిన్న విశ్వాసం లేదని అన్నారు. పార్టీల మధ్య ఎన్ని విభేదాలున్నప్పటికీ ప్రత్యేక హోదాపై కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాను సింపుల్ గా చూసే నేతలను 'సిల్లీ ఫెలోస్' అని పిలుస్తానని స్పష్టం చేశారు. తన దగ్గర డబ్బుల్లేవని, చార్జీలకే వెతుక్కుంటానని, ఓపిక ఉన్నంతవరకు పోరాడతానని ఉద్ఘాటించారు. మీ ఇళ్లలో ఉండే ఒకరిద్దరు పిల్లల భవిష్యత్తు కోసం ఇతరుల జీవితాలు బలిచేయవద్దని నేతలకు హితవు పలికారు. చివరగా, 'రాష్ట్రాన్ని హత్య చేసిందెవరు?' అంటూ ముద్రించిన కరపత్రాన్ని శివాజీ విడుదల చేశారు.