: నాలుగు దశాబ్దాల తరువాత అతని శవం దొరికింది!
42 ఏళ్ల క్రితం సహచరులంతా చూస్తుండగా కొండపై నుంచి కాలు జారి దొర్లిపోయి, అదృశ్యమైన వ్యక్తి శవం ఇన్నాళ్లకు దొరికి సంచలనం రేపింది. న్యూజిలాండ్ లో 1973 సెప్టెంబర్ 16న తన సహచరులతో కలిసి మౌంట్ కుక్ పర్వతాన్ని ఎక్కుతుండగా 19 ఏళ్ల డేవిడ్ ఎరిక్ మ్యూన్ కాలు జారి దొర్లిపడిపోయాడు. అప్పటి నుంచి అతని ఆచూకీ లేదు. అతని కుటుంబం కూడా అతని గురించి గాలించి, ఆశలు వదిలేసుకుంది. డేవిడ్ ఎరిక్ మ్యూన్ మరణించాడని భావించింది. 42 ఏళ్ల తరువాత తాస్ మన్ గ్లేసియర్ దగ్గర అతని మృతదేహం లభ్యమైంది. అతని శరీర భాగాలను సేకరించిన పోలీసులు డీఎన్ఏ టెస్టు నిర్వహించి ఆ మృతదేహం డేవిడ్ దని నిర్థారించి అతని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీనిపై ఎలా స్పందించాలో అర్థం కావట్లేదని, అయితే ఎక్కడ మిస్సయ్యాడో అక్కడే అతడి శవం దొరికిందని, అదే చాలని వారు తెలిపారు.