: విరుచుకుపడ్డ డివిలియర్స్, మన్ దీప్ సింగ్... రాజస్థాన్ లక్ష్యం 181
ఐపీఎల్ సీజన్-8లో భాగంగా పూణేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతున్న క్వాలిఫయర్స్ మ్యాచ్ లో బెంగళూరు 180 పరుగులు చేసింది. టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోహ్లీ (12), గేల్ (27) ధాటిగా బ్యాటింగ్ ఆరంభించారు. స్కోరు బోర్డును పరుగులెత్తించే క్రమంలో వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. దీంతో రంగంలోకి దిగిన ఏబీ డివిలియర్స్ (66), మన్ దీప్ సింగ్ (54) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. బౌలింగ్ ఎవరు చేసినా బంతే శత్రువన్నట్టు బాదారు. ఈ క్రమంలో డివిలియర్స్ రనౌట్ గా వెనుదిరగగా, దినేష్ కార్తిక్ వస్తూనే రెండు ఫోర్లు బాది తన ఉద్దేశ్యం చెప్పాడు. భారీ షాట్ కొట్టే క్రమంలో అవుటయ్యాడు. దీంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో ధావల్ కులకర్ణి రెండు వికెట్లతో రాణించగా, ఒక వికెట్ తో అతనికి మోరిస్ చక్కని సహకారమందించాడు. 181 పరుగుల విజయ లక్ష్యంతో రాజస్ధాన్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.