: లైంగిక దాడి కేసులో నిర్దోషిగా బయటపడిన బంగ్లా క్రికెటర్


బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హుస్సేన్ కు ఊరట కలిగింది. రూబెల్ పై వరల్డ్ కప్ కు ముందు నటి నజ్నీన్ అఖ్తర్ దాఖలు చేసిన లైంగిక దాడి కేసులో ఢాకా కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో రూబెల్ ను న్యాయస్థానం నిర్దోషిగా పేర్కొంది. అతడికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో, కోర్టు అభియోగాలను కొట్టివేసింది. అంతకుముందు... తనతో ప్రేమాయణం సాగించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని నజ్నీన్ క్రికెటర్ పై ఫిర్యాదు చేసింది. దీంతో, వరల్డ్ కప్ కు కొన్ని రోజుల ముందు అతడిపై లైంగిక దాడి కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో, అతడు వరల్డ్ కప్ కు వెళ్లడంపై అనిశ్చితి నెలకొంది. కానీ, దేశ ప్రయోజనాల రీత్యా అతడికి బెయిల్ మంజూరు చేయడంతో, బంగ్లా క్రికెట్ బోర్డు అతడిని జట్టుకు ఎంపిక చేసింది. వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ జట్టు విశేష ప్రతిభ కనబర్చి ముందుకు దూసుకెళ్లడంతో నటి నజ్నీన్ మనసు మార్చుకుంది. తాను రూబెల్ హుస్సేన్ ను క్షమించేశానని, అతడికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సమర్పించబోనని తెలిపింది. సాక్ష్యాధారాలు లేనప్పుడు కేసు నిలబడదని పేర్కొంది.

  • Loading...

More Telugu News