: టీనేజర్లను అమితంగా ఆకట్టుకునేది ముఖ పుస్తకమే!
ముఖపుస్తకానికి (ఫేస్ బుక్ కి) బానిసలు కాని టీనేజర్లు లేరంటే అతిశయోక్తి కాదు. యువతరానికి, సోషల్ మీడియాకు విడదీయలేని బంధం ఉంది. యువతరం ఆటలు, పాటలు, స్నేహాలు, ప్రేమలు, విమర్శలు... అన్నిటికీ ఫేస్ బుక్ వేదికైపోయింది. సోషల్ మీడియాలో టీనేజర్లు ఎక్కువగా ఫాలో అయ్యేది ఫేస్ బుక్. తరువాత గూగుల్ ప్లస్, ఆ తరువాత ట్విట్టర్ అని దేశ వ్యాప్తంగా ఉన్న 14 ప్రముఖ నగరాల్లో చేసిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే 12,365 మంది విద్యార్థులను ప్రశ్నించారు. అందులో 90 శాతం మంది ఫేస్ బుక్ కే ఓటేశారు. 65 శాతం మంది గూగుల్ ప్లస్ అంటే, 44.1 శాతం మంది ట్విట్టర్ ను ఇష్టపడుతున్నట్టు చెప్పారు. వీరిలో 45.5 శాతం మంది విద్యార్థులు సోషల్ మీడియాను స్కూల్ అసైన్ మెంట్స్ కోసం వినియోగించుకుంటున్నామని చెప్పడం సానుకూలాంశం. వికీపీడియా, ఆన్ లైన్ వీడియోస్, ఆన్ లైన్ షాపింగ్ వంటి అవసరాలకు ఫేస్ బుక్ ను నమ్ముకుంటున్నట్టు సర్వే తెలిపింది. అలాగే వాట్సప్ కు కూడా యువతరం నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.