: వెండితెరకు మరో క్రీడాకారిణి జీవిత చరిత్ర!
స్పూర్తిని రగిలించిన క్రీడాకారుల జీవిత విశేషాలతో బాలీవుడ్ లో సినిమాలు నిర్మిస్తూ ఆయా నిర్మాతలు కాసులపంట పండించుకుంటున్నారు. 'చక్ దే ఇండియా', 'భాగ్ మిల్ఖా భాగ్', 'మేరీ కోం' వంటి సినిమాలే అందుకు నిదర్శనం. ఇప్పుడు అదే కోవలో మరో సినిమా రానుంది. 2011లో కదులుతున్న రైల్లోంచి కొందరు దుండగులు తోసేసిన క్రీడాకారిణి అరుణిమ సిన్హా జీవిత చరిత్రను సినిమాగా నిర్మించేందుకు ఫర్హాన్ అఖ్తర్ ముందుకు వచ్చాడు. వాలీబాల్ క్రీడాకారిణి అయిన అరుణిమ సిన్హా సీఐఎస్ఎఫ్ లో ఉద్యోగం కోసం పరీక్ష రాసేందుకు పద్మావతి ఎక్స్ ప్రెస్ జనరల్ బోగీలో ఎక్కారు. ఆమె బ్యాగు, చైన్ లాక్కునేందుకు దొంగలు ప్రయత్నించారు. వారిని అరుణిమ అడ్డుకోవడంతో ఆమెను కదులుతున్న ట్రైన్ లోంచి తోసేశారు. దీంతో ఆమె కాలు కోల్పోయారు. అయినప్పటికీ ఆమె ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. దీంతో 2013లో ఆమె ఎవరెస్టు శిఖరం అధిరోహించారు. కృత్రిమ కాలుతో ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. 'బోర్న్ ఎగైన్ ఆన్ మౌంటెన్' అంటూ ఆమె తన అనుభవాలతో ఓ పుస్తకం రాశారు. అది చదివిన ఫర్హాన్ అఖ్తర్ ఆమె జీవిత చరిత్రను సినిమాగా తీస్తానంటూ ఆమెను సంప్రదించాడు. అతని ప్రతిపాదనకు ఆమె అంగీకరించింది.