: ధైర్యంగా మనుషుల తలలు తెగ్గోసేవారు కావలెను... సౌదీ అరేబియా ఉద్యోగ ప్రకటన
మరణశిక్షలను, ముఖ్యంగా శిరచ్ఛేదనాన్ని అమలు చేసేందుకు 8 మంది కావాలని సౌదీ అరేబియా ఉద్యోగ ప్రకటన వెలువరించింది. సివిల్ సర్వీసెస్ మంత్రిత్వ శాఖ దీన్ని వెలువరుస్తూ, అభ్యర్థులకు ఎటువంటి క్వాలిఫికేషనూ అక్కర్లేదని, రాత పరీక్షలూ ఉండవని తెలిపింది. వివిధ నేరాల్లో దోషులకు కోర్టులు విధించే శిక్షలను వీరు అమలు చేయాల్సి వుంటుందని వివరించింది. ఇస్లామిక్ చట్టాన్ని కఠినంగా అమలు చేసే సౌదీలో మత్తుమందుల రవాణా, అత్యాచారం, హత్య, ఇస్లాంను అవమానించడం, ఆయుధాలతో దోపిడీ వంటి ఎన్నో నేరాలకు మరణశిక్షలు విధిస్తుంటారు. వీటిల్లో అత్యధికం శిరచ్ఛేద శిక్ష ఉంటుంది. మరికొన్ని రాళ్లతో కొట్టి చంపడం, తుపాకీతో కాల్చడం వంటివి వుంటాయి. ఇవన్నీ బహిరంగంగానే అమలవుతాయి. గత సంవత్సరం సౌదీలో 87 మందికి ఈ తరహా శిక్షలను అమలు చేశారు. కాగా, ఈ ఖాళీల భర్తీ ప్రకటన సౌదీ సివిల్ సర్వీసెస్ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లోని 'మతపరమైన ఉద్యోగాలు' సెక్షన్ లో ఉంది.