: ఇకపై '0', '+91' నొక్కకుండానే ఎస్టీడీ కాల్స్
దేశవ్యాప్త మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్ పీ) అమలుకు ప్రధాన అడ్డంకిగా నిలిచిన 'ప్రీఫిక్స్' సమస్య తీరిపోయింది. ఇకపై ఎస్టీడీ కాల్ చెయ్యాలంటే 'సున్నా' లేదా '+91' నొక్కాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా అవతలి వ్యక్తి ఫోన్ నెంబరును డయల్ చేస్తే చాలు. ఇప్పటికే పలు టెలికం సంస్థలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇండియాలో అత్యధికంగా మొబైల్ ఫోన్ కనెక్షన్లు కలిగి వున్న ఎయిర్ టెల్, వోడాఫోన్, ఎంటీఎన్ఎల్ తదితర సెల్ ఫోన్ ఆపరేటింగ్ సంస్థలు '0', '+91' కలపకున్నా కూడా కనెక్షన్లను కలిపే సాంకేతికతను అమలు చేస్తున్నాయి. ఒకటి రెండు కంపెనీలు ఈ సాంకేతికతకు అప్ గ్రేడ్ కాలేదని సమాచారం. ఈ కంపెనీలు జూన్ నెలాఖరులోగా 'ప్రీఫిక్స్' లేకుండా కనెక్టింగ్ సదుపాయాన్ని తమ కస్టమర్లకు అందించాల్సి వుంది. కాగా, జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఎంఎన్ పీ అమలు కానున్న సంగతి తెలిసిందే. ఈ సదుపాయం అమలైతే ఏ సర్కిల్ లోని ఏ టెలికం ఆపరేటర్ సేవలందుకుంటున్న వారైనా, మరో సర్కిల్, ఆపరేటర్ కు అదే నెంబరును మార్చుకోవచ్చు.