: సల్మాన్ ఖాన్ కేసును విచారించలేను...రాజస్థాన్ హైకోర్టుకు తేల్చిచెప్పిన జస్టిస్ విష్ణోయ్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కేసులు న్యాయమూర్తులకు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే హిట్ అండ్ రన్ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును బొంబాయి హైకోర్టు నిలుపుదల చేసి సల్మాన్ కు బెయిల్ మంజూరు చేసింది. ఇక రాజస్థాన్ లో కృష్ణ జింకలను వేటాడిన కేసులోనూ సల్మాన్ ప్రధాన నిందితుడు. ఈ కేసు కూడా ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఈ కేసులో విచారణ దాదాపుగా తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్న ఐదుగురిని పునర్విచారణ చేయాలని సల్మాన్ రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ విష్ణోయ్ కేసు విచారణ చేపట్టలేనని చెప్పారు. ఈ మేరకు ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్ కు తేల్చిచెప్పారు. దీంతో కేసు విచారణ చేపట్టేందుకు మరో న్యాయమూర్తి కోసం చీఫ్ జస్టిస్ వెతుకుతున్నారట.