: ‘నిమిషం’ నిబంధనతో కూతురినే పరీక్షకు అనుమతించని ప్రిన్సిపాల్!
నిబంధనలు అందరికీ వర్తిస్తాయని ఆ ప్రిన్సిపాల్ చెబుతారు. ఇందులో తనవారైనా, పరాయి వారైనా ఒకటేనని ఆయన చెబుతారు. అయినా, నిబంధనలు పెట్టుకునేది అమలు చేసేందుకే కాని, తుంగలో తొక్కేందుకు కాదని కూడా ఆయన చెబుతారు. చెప్పడమే కాదండి బాబూ, నిన్న ఏకంగా చేసి చూపారు. నిబంధనను పాటించని తన సొంత కూతురును ఆ ప్రిన్సిపాల్ పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. తండ్రి నిక్కచ్చితనంతో పరీక్ష రాసేందుకు వచ్చిన ఆ కూతురు నిరాశతో ఇంటిబాట పట్టింది. హైదరాబాదులోని నిజాం కళాశాల గేటు వద్ద నిన్న ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే, నిన్న లాసెట్-2015 పరీక్ష జరిగింది. నిమిషం లేటైనా పరీక్షకు అనుమతించేది లేదని గతంలోనే అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షకు నగరంలోని పీజీ లా కళాశాల ప్రిన్సిపాల్ గాలి వినోద్ కుమార్ రీజనల్ కో-ఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు. ఇంటర్ పూర్తి చేసిన వినోద్ కుమార్ కూతురు పరివర్తన ఐదేళ్ల లా కోర్సు చేసేందుకు లాసెట్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకుంది. నిన్న ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల మధ్య జరిగిన పరీక్షకు హాల్ టికెట్ (నెం. 522020286) చేతబట్టుకుని తనకు కేటాయించిన నిజాం కళాశాలకు బయలుదేరింది. అయితే పరివర్తన కళాశాల గేటు వద్దకు చేరుకునేలోగానే నిర్ణీత సమయం ముగియడంతో గేటు మూసేశారు. అప్పటికి సమయం సరిగ్గా ఉదయం 10.01 గంటలు. అంటే, నిర్ణీత సమయం కంటే నిమిషం ఎక్కువ. ఆ సమయంలో వినోద్ కుమార్ గేటు వద్దే ఉన్నారు. ఆయన ఆదేశాలతోనే సిబ్బంది గేట్లేశారు. ఈలోగా ఆయన కూతురు అక్కడకు చేరుకుంది. అయినా వినోద్ కుమార్ ఏమాత్రం తన పట్టు సడలించలేదు. నిమిషం లేటైందిగా పరీక్షకు అనుమతించేది లేదని తేల్చిచెప్పేశారు. దీంతో చేసేదేమీ లేక పరివర్తన ఇంటి బాట పట్టింది.