: అప్పుడు అలా అన్నారు... ఇప్పుడు ఇలా అంటున్నారు!: రాహుల్ గాంధీ
యూపీఏ అధికారంలో ఉండగా నిధులన్నీ అమేథీకే కేటాయిస్తున్నానని ఎన్డీయే పెద్దలు ఆందోళనకు, విమర్శలకు దిగేవారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. అమేథీలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు అదే ఎన్డీయే పెద్దలు అమేథీలో అభివృద్ధే జరగలేదని అంటున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని, ఉద్దేశ పూర్వకంగానే తన నియోజకవర్గానికి నిధులు కేటాయించకుండా అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు. అమేథీలో రెండో రోజు పర్యటించిన ఆయన 48 అభివృద్ధి పనులు ప్రారంభించారు. తనపై కక్ష సాధింపులకు పాల్పడేందుకు రైతులకు అన్యాయం చేస్తున్నారని, అది మానుకోవాలని ఆయన సూచించారు. మెగా ఫుడ్ ప్రాజెక్టు విషయంలో రైతుల పొట్ట కొట్టారని, తనపై కక్ష ఉంటే, తనను సాధించాలి కానీ, రైతులను కాదని ఆయన హితవు పలికారు. ఎన్డీయే ప్రభుత్వానికి పథకాలు ఆపేయడం ఫ్యాషన్ గా మారిందని ఆయన ఎద్దేవా చేశారు.