: శతాబ్దపు ఫైట్... ఇప్పుడు కోర్టులో ఫైట్ గా మారింది!
ఈ శతాబ్దంలో ఇంతకుమించిన బాక్సింగ్ బౌట్ లేదంటూ ఊదరగొట్టారు! వాళ్లిద్దరూ అరివీర భయంకరులని ప్రచారం చేశారు! తీరా రింగ్ లో కొచ్చేసరికి ఒకరు ఆత్మరక్షణకు అధిక ప్రాధాన్యమివ్వగా, మరొకరు అదేపనిగా పంచ్ లు విసిరినా, పాయింట్లు చేజిక్కించుకోవడంలో విఫలమయ్యారు. ఫ్లాయిడ్ మేవెదర్-మానీ పకియావ్ ల మధ్య ఫైట్ ఆఫ్ ద సెంచరీ అంటూ వరల్డ్ మీడియాలో వచ్చిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ గురించే ఇదంతా. ఇప్పుడీ బౌట్ వ్యవహారం కోర్టుకు చేరింది. ఈ పోరుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్, బౌట్ నిస్సారంగా ముగిసేసరికి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తమ డబ్బు తమకు తిరిగిచ్చేయాలంటూ కోర్టులో దావా వేశారు. పకియావ్ తన భుజం గాయాన్ని ఫైట్ కు ముందే చెప్పి ఉంటే, తాము బౌట్ కు రుసుం చెల్లించేవారం కాదని, ఇది ఫైట్ ఆఫ్ ద సెంచరీ కాదని, ఫ్రాడ్ ఆఫ్ ద సెంచరీ అని మండిపడుతున్నారు.