: సామూహిక అత్యాచారాలు చేస్తున్నారు: బోకోహరామ్ దురాగతాలపై నైజీరియా మహిళల ఆక్రందన


బోకోహరామ్ ఉగ్రవాదుల దురాగతాలు మరింతగా పెచ్చుమీరుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో తమ పట్టు పెంచుకోవాలని భావిస్తున్న మిలిటెంట్లు నైజీరియా ప్రాంతంలో వందలాది మంది మహిళలు, బాలికలను చెరబట్టి వారిపై సామూహిక అత్యాచారాలు చేస్తున్నారట. డజన్లకొద్దీ మహిళలను గదుల్లో కుక్కి, బలవంతంగా తమ కోర్కెలు తీర్చుకుంటున్నారని హమ్సతూ అనే 25 ఏళ్ల మహిళ వాపోయింది. మైదుగురి అనే ప్రాంతంలో సైన్యం ఉగ్రవాదులపై దాడులను తీవ్రం చేసి కొందరిని విడిపించింది. వారిలో హమ్సతూ కూడా ఉన్నారు. ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, వారు బోకోహరామ్ కొత్త తరాన్ని సృష్టించే పని పెట్టుకున్నారని, పుట్టే బిడ్డలకు తండ్రెవరో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయని నాలుగు నెలల గర్భవతిగా ఉన్న ఆమె ఆక్రోశించారు. వివాహం చేసుకుని కూడా తమ భార్యలను ఇతరులకు అప్పగిస్తున్నారని, అదేమని ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. కాగా, బోకోహరామ్ మిలిటెంట్లు కిడ్నాప్ చేసిన యువతుల్లో 200 మందికి పైగా గర్భవతులుగా ఉన్నారని తెలుస్తోంది. గర్భవతులుగా ఉండి చెర నుంచి బయటపడిన వారు తమకా బిడ్డలు వద్దని చెబుతున్నట్టు పునరావాస అధికారులు తెలిపారు. గత సంవత్సరం చిబోక్ గ్రామం నుంచి ఉగ్రవాదులు 300 మంది పాఠశాల విద్యార్థినులను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. వీరి పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉందని సమాచారం. వీరిలో అత్యధికులు 12 సంవత్సరాల వయసున్న వారు కాగా, వారి తల్లిదండ్రులు తమ కుమార్తెలను వెనక్కు తీసుకురావాలని సంవత్సర కాలంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నా లాభం లేకపోయింది. యహువ్వా అనే 30 సంవత్సరాల యువతి మాట్లాడుతూ, తనకు హెచ్ఐవీ సోకిందని, అందువల్లే తనను విడిచిపెట్టారని, లేకుంటే అక్కడే బాధలు అనుభవిస్తూ ఉండేదాన్నని కన్నీళ్ల పర్యంతమైంది. ఓ పెద్ద రూంలో తమను బందీలుగా ఉంచారని, తలుపు తీసి ఒకరిని ఎంపిక చేసుకుని తీసుకెళ్లేవారని, వివాహం చేసుకోవాలని బెదిరించేవారని, అది మూణ్ణాళ్ల ముచ్చటేనని, మరొకరు వచ్చి తీసుకెళ్లేవారని అక్కడి దారుణాలను కళ్లకు కట్టారు. సైన్యం దాడులతో బోకోహరామ్ కాస్తంత వెనుకకు తగ్గగా, బందీలను విడిపించేందుకు ఇదే సరైన సమయమని అధికారులు దాడులను ఉద్ధృతం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News