: ఆభరణాలు వద్దు... టాయిలెట్ చాలన్న వధువుకు రూ. 10 లక్షల నజరానా!
మూడు ముళ్లు వేయించుకొని మెట్టినింట అడుగు పెట్టిన వధువుకు నిప్పులాంటి నిజమొకటి తెలిసింది. తన భర్త ఇంట టాయిలెట్ లేదని తెలుసుకున్న ఆమె, పెళ్లి కానుకగా బంగారు ఆభరణాలకు బదులు టాయిలెట్ ఇవ్వాలని కోరింది. ఈ ఘటన మహారాష్ట్రలోని అలోకా జిల్లా అందురాలో జరిగింది. ఇక్కడి చైతలీ గలాఖే అనే అమ్మాయికి యవత్మాలా జిల్లాకు చెందిన దేవేంద్ర మకోడే అనే అబ్బాయితో ఇటీవల పెళ్లి జరిగింది. అత్తారింట్లో మరుగుదొడ్డి ఉండాల్సిందేనని, తనకు బంగారం కన్నా టాయిలెట్ ముఖ్యమని తేల్చి చెప్పడంతో అప్పటికప్పుడు అన్ని వసతులున్న ఓ ప్రీఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్ ను పుట్టింటివారు, అత్తింటివారు కలిసి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సులభ్ ఇంటర్నేషనల్ వారు చైతలీకి రూ. 10 లక్షల నగదును బహుమతిగా ప్రకటించారు.