: లంచం ఇవ్వజూపిన కేజ్రీవాల్ కుమార్తెపై చర్యలకు డిమాండ్
సర్టిఫికెట్లు లేకపోయినా, తనకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వ అధికారికి లంచం ఇవ్వజూపిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కుమార్తె హర్షితపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఢిల్లీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఒమేష్ సైగల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అవినీతి నిరోధక శాఖ హెడ్ ఎస్.ఎస్. యాదవ్ కు ఆయన లేఖ రాశారు. తన కుమార్తె ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి లంచం ఇస్తానని చెబితే అధికారులు తీసుకోలేదని, అవినీతిని రూపుమాపే విషయంలో ఢిల్లీ ముందడుగు వేసిందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై అవినీతి నిరోధక చట్టం-1988లో సెక్షన్ 12 ప్రకారం కేసు పెట్టాలని సైగల్ డిమాండ్ చేశారు. ఇదే విషయమై హర్షితపై భగత్ సింగ్ క్రాంతిసేన అధ్యక్షుడు తేజేందర్ పాల్ సింగ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ సెక్షన్ ప్రకారం కేసు పెడితే కనీసం ఆరు నెలల వరకూ జైలు శిక్షకు అవకాశముందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.