: యూనివర్శిటీలేమైనా రాజదర్బార్లా? తమాషా చేస్తున్నారా?: ఉస్మానియా విద్యార్థులపై కేసీఆర్ ఫైర్
హైదరాబాదులోని యూనివర్శిటీల్లో అధికంగా ఉన్న స్థలాలను స్వాధీనం చేసుకుని వాటిల్లో పేదలకు ఇళ్లు కట్టించి తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఉస్మానియా ఖాళీ స్థలాల్లో ఇళ్లు కట్టిస్తామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా విద్యార్థులు ఆందోళన చేసిన నేపథ్యంలో కేసీఆర్ ఫైర్ అయ్యారు. యూనివర్శిటీలేమైనా రాజదర్బార్లా? మహారాజుల గదులా? తమాషా చేస్తున్నారా? అని ప్రశ్నించిన ఆయన, ప్రజల సొత్తు ప్రజలకు చెందాల్సిందేనని, పేదోళ్లకు ఇళ్లు కట్టాలంటే నగరానికి 50 కి.మీ దూరం వెళ్లాలన్న రోజులు పోయాయని అన్నారు. డబ్బున్నోళ్లు గేటెడ్ కమ్యూనిటీలు కట్టుకున్నట్లు పేదోళ్లూ ఇళ్లు కట్టుకోవాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. స్వచ్ఛ హైదరాబాదులో భాగంగా, హమాలీబస్తీలో పర్యటించిన ఆయన వచ్చే నాలుగైదు నెలల్లో రూ. 21 కోట్ల ఖర్చుతో పేదలకు ఆరంతస్తుల్లో ఫ్లాట్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.