: ‘చెన్నై’కి అభిమానుల వెల్లువ... ఫేస్ బుక్ ‘ఫ్యాన్ డమ్’లో వెల్లడి!
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ ఖ్యాతిగాంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు దఫాలుగా ట్రోపీని కైవసం చేసుకున్న ఈ జట్టు, తాజా ఐపీఎల్ లోనూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ప్లే ఆఫ్ బెర్తు ఖరారు చేసుకున్న జట్లలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని ఈ జట్టు ‘ఫెయిర్ ప్లే’ విషయంలోనూ ఏటా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. తాజాగా ఐపీఎల్ జట్లలో ఏ జట్టుకు అభిమానులు ఎక్కువున్నారన్న విషయంపై సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ‘ఫ్యాన్ డమ్’ పేరిట ప్రత్యేక సర్వేను చేపట్టింది. ఈ సర్వేలోనూ చెన్నై సూపర్ కింగ్స్ కే అభిమానులు ఓటేశారు. దేశంలో అత్యధిక సంఖ్యలో అభిమానులున్న జట్టుగా చెన్నై అవతరించింది. సొంత జట్లున్న రాష్ట్రాల ప్రజలను మినహాయిస్తే మిగిలిన అన్ని రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్ చెన్నైకే ఓటేశారు. ఇక ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఉన్న ఢిల్లీ వాసులు, తమ సొంత జట్టు కంటే చెన్నై అంటేనే ఆసక్తి చూపుతున్నారట.