: పోలవరం ప్రాజెక్టుపై ఉమా భారతి హామీ
కేంద్ర మంత్రి ఉమా భారతితో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. సమావేశంలో ఆమెతో పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. ఇంకా పలు ప్రాజెక్టుల గురించి కూడా కేంద్ర మంత్రితో మాట్లాడారు. ఈ భేటీ అనంతరం ఉమా భారతి మీడియా ముందుకు వచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత ఏర్పడే ప్రశ్నేలేదని అన్నారు. ఈ ప్రాజెక్టును షెడ్యూల్ ప్రకారమే, అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుపై తమకు చిత్తశుద్ధి ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబుకు మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయం ఎక్కడుండాలన్నదానికి, ప్రాజెక్టు పనుల పురోగతికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు తక్కువగా జరిగిందని ఆమె అంగీకరించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, మరిన్ని నిధులు మంజూరు అయ్యేలా తోడ్పాటునందిస్తామని తెలిపారు. అంతేగాకుండా, ఏపీలో ఇతర సాగునీటి ప్రాజెక్టులకు కూడా కేంద్రం సాయం అందిస్తుందని తెలిపారు. కాగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు పలువురు కేంద్ర ప్రముఖులను కలుస్తూ బిజీగా ఉన్నారు.