: మోదీ ప్రభుత్వానికి సున్నా మార్కులు వేసిన రాహుల్
దేశ ప్రధానిగా నరేంద్రమోదీ విదేశీ పర్యటనలు చేస్తున్నారే తప్ప... రైతులను కలసి, వారి కష్టాలను తెలుసుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఆయనకు రైతులను పట్టించుకునే సమయం కూడా లేదని మండిపడ్డారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వానికి 10 మార్కులకు గాను సున్నా మార్కులు వచ్చాయని ఎద్దేవా చేశారు. తన సొంత నియోజకవర్గం అమేథీలో పర్యటించిన రాహుల్... అక్కడ పంట నష్టపోయిన రైతులను కలుసుకున్నారు. మూడు రోజుల పాటు ఆయన అమేథీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ నిధుల నుంచి నిర్మించతలపెట్టిన పలు ప్రాజెక్టులకు రాహుల్ శంకుస్థాపన చేస్తారని యూపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ సింగ్ తెలిపారు.