: చిరంజీవి ఆవిష్కరించింది అనుమతి లేని విగ్రహాన్నా?
నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కొన్ని రోజుల క్రితం కడప జిల్లా రైల్వే కోడూరులో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే, రైల్వే కోడూరులో ఈ విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదని అధికారులు పేర్కొనడం వివాదాస్పదమైంది. నిర్వాహకులు అనుమతి తీసుకోలేదని అధికారులు అంటున్నారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. కాగా, రైల్వే కోడూరులోని శ్రీభుజంగేశ్వరస్వామి ఆలయం ఎదుట ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శనివారం నాడు చిరంజీవి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విగ్రహావిష్కరణ తన పూర్వజన్మ సుకృతం అని పేర్కొన్నారు. ఇంతకుముందు, ఈ విగ్రహావిష్కరణకు రావాలని చాలాసార్లు ఆహ్వానాలు అందినా, పని ఒత్తిడి కారణంగా రాలేకపోయానని చిరు అన్నారు.