: ఇల్లు కొనాలంటే సరాసరిన రూ. 50 లక్షలకు పైగా ఉండాల్సిందే!
ఇండియాలో గృహాల ధరలు గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయికి పెరిగాయి. భారత్ లో సరాసరిన ఇంటి ధర ఆల్ టైం రికార్డు స్థాయిలో రూ. 52 లక్షలకు చేరిందని గృహరుణ సంస్థ హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ వెల్లడించింది. ఇదే సమయంలో సొంతిల్లు కొనుగోలు చేస్తున్న వ్యక్తి వార్షికాదాయం సరాసరిన రూ. 12 లక్షలకు పెరిగిందని, ఇది కూడా ఓ రికార్డని హెచ్ డీఎఫ్ సీ గణాంకాలు వెల్లడించాయి. గృహాల ధరల కన్నా వేగంగా ఆదాయ స్థాయి పెరుగుతోందని, అందుబాటు ధరల్లో గృహాల లభ్యత నిష్పత్తి 2004తో పోలిస్తే 4.4 నుంచి 4.3 శాతానికి తగ్గిందని తెలుస్తోంది. సరాసరి గృహ ధరతో సరాసరి వార్షికాదాయాన్ని భాగించి అందుబాటు ధరల్లో లభించే గృహాల నిష్పత్తిని గణిస్తారన్న సంగతి తెలిసిందే. ఇది ఎంత తక్కువగా ఉంటే అంత సులభంగా సొంతింటి కల సాకారమవుతున్నట్టు. పన్ను రాయితీలు, అందుబాటులో ఉన్న వడ్డీ రేట్లు తదితర కారణాల వల్ల గృహాల కొనుగోలుకు ఎక్కువ మంది ముందుకు వస్తున్నారని హెచ్ డీఎఫ్ సీ తన తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. గృహ రుణాలపై ఆదాయ పరిమితి అవధులు సవరించడంతో గృహ రుణాలకు డిమాండ్ పెరిగిందని హెచ్ డీఎఫ్ సీ మేనేజింగ్ డైరెక్టర్ రేణూ సూద్ వ్యాఖ్యానించారు. ప్రజల్లో డీఐఎన్ కే (డబుల్ ఇన్ కం - నో కిడ్స్) పెరగడం కూడా గృహాల కొనుగోలును సులభతరం చేస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, హెచ్ డీఎఫ్ సీ ఇప్పటివరకూ రూ. 2.5 లక్షల కోట్లను గృహ రుణాల రూపంలో ఇచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే 23 శాతం అధిక రుణాలను మంజూరు చేయగా, సరాసరి గృహ రుణం రూ. 23.3 లక్షల రూపాలుగా ఉంది. గడచిన మూడున్నర దశాబ్దాల కాలంలో మొత్తం 49 లక్షల గృహాలకు రుణ సాయం చేసింది.