: డ్రైవర్ కునుకు తీయడంతోనే ‘కేశినేని’ బస్సు బోల్తా కొట్టిందట!
నిన్న రాత్రి అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేట వద్ద బోల్తా కొట్టిన కేశినేని ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారణాలు తెలుస్తున్నాయి. బస్సు నడిపిన డ్రైవర్ కునుకుతీసిన కారణంగా 47 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి హైదరాబాదుకు వస్తున్న ఆ బస్సు బోల్తా కొట్టిందట. ఈ మేరకు ప్రత్యక్ష సాక్షులు అనంతపురం పోలీసులకు చెప్పారు. ఇదిలా ఉంటే, 600 కిలో మీటర్లకు పైగా ఉన్న దూరం మేర ప్రయాణానికి కేశినేని ట్రావెల్స్ యాజమాన్యం ఒకే ఒక్క డ్రైవర్ ను నియమించిందని తెలిసింది. సాధారణంగా 300 కిలో మీటర్ల దూరానికే ఆర్టీసీ ఇద్దరు డ్రైవర్లను వినియోగిస్తోంది. అయితే అత్యాధునిక వసతులు, శరవేగంగా దూసుకుపోయే వోల్వో తరహా బస్సుల సుదూర ప్రయాణానికి కేశినేని ట్రావెల్స్ కేవలం ఒక్క డ్రైవర్ నే వినియోగిస్తుండటం గమనార్హం. ఇదిలా ఉంటే, ప్రమాదంలో బోల్తా కొట్టిన కేశినేని వోల్వో బస్సు రోడ్డు పక్కగా ఎనిమిదిసార్లు పల్టీలు కొట్టింది. అనంతరం ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డ బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.