: అక్బర్ గొప్పవాడే, చరిత్రను తప్పుబట్టను... కానీ...: రాజ్ నాథ్ సింగ్
మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించిన అక్బర్ చక్రవర్తి గొప్పవాడు అనడంలో సందేహం లేదని... ఆయనను గొప్పగా కీర్తించిన చరిత్రను కూడా తప్పుబట్టనని... అయితే, రాజ్ పుత్ వీరుడు, మేవార్ రాజు మహారాణా ప్రతాప్ కూడా అంతే స్థాయి కలిగిన వ్యక్తి అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. దేశంలోని పాఠ్యాంశాల్లో రాణా ప్రతాప్ కు సరైన స్థానాన్ని కల్పించలేకపోయారని అన్నారు. హల్దీఘాట్ యుద్ధంలో అక్బర్ చేతిలో రాణా ప్రతాప్ ఓడిపోయిన సంగతిని తాను కూడా ఒప్పుకుంటానని తెలిపారు. రానున్న రోజుల్లో చరిత్రను సరైన రీతిలో సవరించాల్సిన అవసరం ఉందని... రాణా ప్రతాప్ ను కూడా 'ది గ్రేట్'గా అభివర్ణించాలని సూచించారు. స్వదేశం కోసం పోరాడిన ఎంతో మందికి రాణా ప్రతాప్ ఆదర్శంగా నిలిచారని... కన్నభూమి కోసం అతను చేసిన త్యాగాలు కొనియాడదగినవని చెప్పారు. రాణా ప్రతాప్ ను ఆదర్శంగా తీసుకునే వియత్నామీలు అమెరికాలాంటి అగ్రరాజ్యాన్ని సైతం ఓడించగలిగారని తెలిపారు. ప్రతాప్ ఘడ్ జిల్లా కలెక్టరేట్ లో రాణా ప్రతాప్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా రాజ్ నాథ్ పైవ్యాఖ్యలు చేశారు.