: కేటీఆర్ తో నాకు పోలికేంటి?: లోకేష్
తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి తారక రామారావుకు, తనకు పోలిక లేదని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఓ ఐటీ మంత్రిగా ఆయన అమెరికాలో పర్యటించారని, తాను కేవలం ఓ కార్యకర్తగా మాత్రమే ఆంధ్రప్రదేశ్ లోని వ్యాపార అవకాశాలను గురించి వివరించేందుకు అమెరికా వెళ్లానని ఆయన అన్నారు. ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఓ మంత్రిగా వెళ్లి ఆయన రెండు డీల్స్ కుదుర్చుకుని వచ్చారని, త్వరలో జరిగే తమ నేత చంద్రబాబు పర్యటనలో ఎన్నో డీల్స్ కుదురుతాయని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరం అన్ని రకాల సౌకర్యాలు ఉన్న అద్భుత నగరమని వ్యాఖ్యానించిన లోకేష్, అమరావతికి అంతకు మించిన పేరు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని వివరించారు. చంద్రబాబు నాయుడిని విమర్శించే అర్హత ఎవరికీ లేదని అన్నారు. తాను తెరవెనుక ఉండి వ్యవహారాలు నడిపిస్తున్నానని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా, కార్యకర్తల అభిప్రాయాలు స్వీకరించడం తమ నేత ఉద్దేశమని, అందులో భాగంగా మాత్రమే తన అభిప్రాయాలు వెల్లడిస్తానని తెలిపారు.