: టీమిండియా కోచ్ రేసులో జస్టిన్ లాంగర్, ఆండీ ఫ్లవర్!
టీమిండియాకు మరోసారి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కోచ్ గా వ్యవహరించనున్నారా? అంటే, బీసీసీఐ వర్గాలు అవుననే చెబుతున్నాయి. మొన్నటి వరల్డ్ కప్ తర్వాత జట్టు కోచ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డంకన్ ప్లెచర్ పదవీ కాలం ముగిసింది. ప్రస్తుతం కోచ్ పదవి ఖాళీగానే ఉంది. ఈ పదవికి భారత మాజీ కెప్టెన్లు సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ లలో ఒకరికి అవకాశం ఇవ్వనున్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈసారి కోచ్ పదవి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఆ దేశ జట్టు మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ కు దక్కనుందని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం కోచ్ పదవికి సరిపోయే మాజీ క్రికెటర్ ను వెతికే పనిలో బీసీసీఐ బిజీబిజీగా చర్చలు జరుపుతోంది. గతంలో లాంగర్ ఆసీస్ కు బ్యాటింగ్ కన్సల్టెంట్ గా పనిచేశాడు. ప్రస్తుతం ఆయన వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు కోచ్ గా ఉన్నారు. 44 ఏళ్ల వయసున్న లాంగర్, 105 టెస్టులాడి 7,696 పరుగులు చేశాడు. అందులో 23 సెంచరీలు కూడా ఉన్నాయి. ఆటగాడిగా కంటే వ్యూహకర్తగా ఆయనకు మంచి పేరుంది. ఇదిలా ఉంటే, లాంగర్ తో పాటు ఇంగ్లండ్ మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్ పేరును కూడా టీమిండియా కోచ్ పదవికి బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం.