: ‘సన్ రైజర్స్’ కు షాక్... ప్లే ఆఫ్ కు ‘ఇండియన్స్’


ఐపీఎల్-8లో సన్ రైజర్స్ హైదరాబాదుకు షాక్ తగిలింది. ప్లే ఆఫ్ పై గంపెడాశలు పెట్టుకున్న ఆ జట్టుపై ముంబై ఇండియన్స్ నీళ్లు చల్లింది. నిన్న రాత్రి హైదరాబాదులో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో రోహిత్ సేన, డేవిడ్ వార్నర్ జట్టును చిత్తుగా ఓడించింది. 9 వికెట్ల తేడాతో సాధించిన విజయంతో ముంబై ఇండియన్స్ నేరుగా ప్లేఆఫ్ చేరుకోగా, సన్ రైజర్స్ ఇంటిబాట పట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాదు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆలౌటై 113 పరుగుల స్వల్ప స్కోరు చేసింది. ఓపెనర్లు వార్నర్(6), శిఖర్ ధావన్(1)లతో పాటు కీలక మ్యాచ్ లలో బ్యాటు ఝుళిపించిన మొయిసెస్ హెన్రికాస్ (11), ఇయాన్ మోర్గాన్ (9) కూడా చేతులెత్తేశారు. లోకేశ్ రాహుల్ (25) కరణ్ శర్మ(15), ఆశిష్ రెడ్డి (17)లతో పాటు టెయిలెండర్ డేల్ స్టెయిన్ (19) కాస్త రాణించడంతో హైదరాబాదు జట్టు ఆ స్థాయి స్కోరైనా చేయగలిగింది. ఆ తర్వాత 114 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్, 13.5 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ (51 నాటౌట్) మరో ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్ (48)తో కలిసి హైదరాబాదు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 37 బంతుల్లోనే పటేల్ తొమ్మిది ఫోర్లతో హాఫ్ సెంచరీని సాధించాడు. లక్ష్యానికి చేరువలో సిమ్మన్స్ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, తానెదుర్కొన్న రెండు బంతుల్లో ఓ బంతిని సిక్స్ గా మలిచి జట్టును గెలుపు తీరం చేర్చాడు.

  • Loading...

More Telugu News