: చనిపోయాడని వైద్యులు ప్రకటించారు... అతడు తనకు దేవుడు కనిపించాడని చెబుతున్నాడు!
అమెరికాలో విచిత్రం చోటుచేసుకుంది. ఉన్నట్టుండి కుప్పకూలిపోయిన కుర్రాడిని డాక్టర్లు మరణించినట్టు ప్రకటించారు. అయితే, 20 నిమిషాల అనంతరం అతడి నాడి కొట్టుకోవడంతో అందరూ ఆశ్చర్యపడ్డారు. కోలుకున్న అనంతరం తనకు దేవుడు కనిపించాడని చెబితే మరింత ఆశ్చర్యానికి లోనయ్యారు. వివరాల్లోకెళితే... టెక్సాస్ బ్రౌన్ వుడ్ లో జాక్ క్లెమెంట్ (17) అనే హైస్కూల్ సాకర్ ఆటగాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్ లో భాగంగా స్ప్రింట్ సాధన చేస్తూ అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. పల్స్ పడిపోయింది. పరీక్షించి చూసిన డాక్టర్లు, హృదయస్పందన లేకపోవడంతో 'డెడ్' అని ప్రకటించారు. అయితే, కాసేపటికి అతడి నాడి కొట్టుకోవడం ప్రారంభించింది. దీంతో, అతడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఫోర్ట్ మౌత్ లోని కుక్ చిల్డ్రన్ హాస్పిటల్ కు మెరుగైన వైద్యం నిమిత్తం తరలించారు. అక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొంది మామూలు మనిషయ్యాడు. అనంతరం, జాక్ మాట్లాడుతూ, తాను అచేతనంగా పడి ఉన్న వేళ తనకు పొడవైన జుట్టు, గుబురు గడ్డంతో ఉన్న వ్యక్తి కనిపించాడని, దాంతో, అతడు జీసస్ అని గుర్తు పట్టడానికి తనకు ఎక్కువ సమయం పట్టలేదని వివరించాడు. తాను పైకి లేచానని, ఆయన తన భుజంపై చేయివేసి, అంతా బాగవుతుందని, బాధపడాల్సిన పనిలేదని చెప్పాడని తెలిపాడు. దీనిపై, జాక్ తండ్రి బిల్లీ మాట్లాడుతూ, కొందరు తన కుమారుడు చెబుతున్న దానిని అంగీకరించడం లేదని, కానీ, తమ కుటుంబం మాత్రం ఓ దివ్యమైన అద్భుతాన్ని చవిచూసిందని చెప్పారు. జాక్ తల్లి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. జీసస్ తన కుమారుడిని బతికించాడని తెలిపింది.