: విశిష్ట కానుక ఇచ్చారు... ఫిడేల్ వాయించి ఆకట్టుకున్నారు!
భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ నేతలకు అరుదైన కానుకలిచ్చి వారిని సర్ ప్రైజ్ చేయడాన్ని ఇష్టపడతారు. ప్రస్తుతం మంగోలియా పర్యటనలో ఉన్న ఆయన ఇలాగే ఆశ్చర్యపరిచారు. మంగోలియా అధ్యక్షుడు సఖియాజిన్ ఎల్బెగ్ డోర్జ్ కు ఓ పురాతన చేతివ్రాత ప్రతిని కానుకగా ఇచ్చారు. 13వ శతాబ్దానికి చెందిన ఈ వ్రాత ప్రతి మంగోలుల చరిత్రకు సంబంధించినది కావడం విశేషం. ఇది 80 లఘు వివరణలతో కూడినది. దీనిపేరు జమియుత్ తవారిఖ్. ఇల్ఖనాటీ రాజు ఘజన్ ఖాన్ (1295-1304) తన వజీరు రషీదుద్దీన్ ఫజులుల్లా హమేదాని సాయంతో దీన్ని అక్షరబద్ధం చేయించారు. దీన్ని పర్షియన్ భాషలో రాశారు. అటు, తమను ఆశ్చర్యపరిచిన ప్రధాని మోదీకి మంగోలియా అధ్యక్షుడు ఓ ఫిడేల్ (మోరిన్ ఖూర్)ను కానుకగా ఇచ్చారు. ఈ వాయిద్యంతో ప్రధాని కాసేపు సందడి చేసి అందరినీ ఉల్లాసపరిచారు.