: ఆ దేశమంతా కలిసి గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టింది!
ప్రపంచ పటంలో ఓ చిన్ని బొట్టుబిళ్లలా కనిపించే ఈక్వెడార్ ఓ కొత్త గిన్నిస్ రికార్డును నెలకొల్పింది. దేశంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచే ఉద్దేశంతో అధ్యక్షుడు రఫెల్ కోరియా ఇచ్చిన పిలుపు మేరకు ఒక్క రోజులో 6,47,250 మొక్కలను నాటడం ద్వారా పాత రికార్డును బద్దలు కొట్టింది. ఇందుకోసం దేశంలోని ప్రజలంతా ఏకతాటిపై నిలిచారు. పలు రకాల సుగంధ ద్రవ్యాల మొక్కలను, ఇతర జాతులకు చెందిన మొక్కలనూ నాటినట్టు రఫెల్ కోరియా వివరించారు. "నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది. మనం గిన్నిస్ రికార్డును బ్రేక్ చేశామట" అని ఆయన తన వారాంతపు ప్రసంగంలో జాతిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ రికార్డు గతంలో ఫిలిప్పీన్స్ పేరిట ఉండేది. కాగా, మొత్తం 44,883 మంది ప్రజలు 2 వేల హెక్టార్ల భూభాగంలో ఈ మొక్కలు నాటారని ఈక్వెడార్ అధికారులు ప్రకటించారు. ఈక్వెడార్ పేరిట ఒక వారంలో అత్యధిక ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేసిన రికార్డు, ఒకేసారి ఇసుకలో అత్యధికులను పూడ్చిపెట్టిన రికార్డు ఉన్నాయట.