: తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల... బాలికలే టాప్


తెలంగాణలో పదవ తరగతి ఫలితాలు వెల్లడయ్యాయి. విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి ఈ ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడించారు. పదవ తరగతిలో సైతం బాలికలే సత్తా చాటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో బాలురు 76.11 శాతం, బాలికలు 79.04 శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రైవేటుగా పరీక్ష రాసిన వారిలో 54 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాల వారీగా చూస్తే, వరంగల్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో పరీక్షలు రాసిన వారిలో 91.6 శాతం మంది పాస్ కాగా, ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచి 54.9 శాతంతో సరిపెట్టుకుంది. వీరందరికీ ఈ నెల 25లోగా మార్కులు సంబంధిత పాఠశాలలకు పంపుతామని కడియం వివరించారు. ఈ సంవత్సరం 1,491 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించగా, 28 పాఠశాలలు జీరో రిజల్ట్స్ నమోదు చేశాయని తెలిపారు. జూన్ 18 నుంచి జూలై 2 వరకూ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, ఇందుకోసం ఈనెల 30లోగా ఫీజులు చెల్లించాలని ఆయన సూచించారు. ఈ తేదీలను పొడిగించడానికి వీలు కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేటు పాఠశాలలు ర్యాంకులను ప్రకటించుకుంటూ ప్రకటనలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News