: నేతాజీ నిధి ఏమైంది?... ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై చిక్కుముడి వీడక రాజకీయ దుమారం చెలరేగుతున్న సమయంలో మరింత సంచలనం కలిగించే మరో ప్రశ్న ఉత్పన్నమైంది. ఆయన ప్రారంభించిన జాతీయ సైన్యం 'ఆజాద్ హింద్ ఫౌజ్' పోషణ కోసం సమీకరించిన బంగారం, నిధులు ఏమయ్యాయనేది అంతుబట్టని రహస్యంగానే ఉండిపోయింది. అప్పటి పత్రాలు, ప్రభుత్వ నివేదికలను బట్టి ఈ నిధి విలువ కొన్ని కోట్లు ఉంటుందని అంచనా. దీనిపై దర్యాప్తు జరపాలన్న విజ్ఞప్తిని అప్పటి నెహ్రూ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందనేది తాజాగా వెలుగు చూసిన అంశం. అప్పట్లో నెహ్రూ ప్రభుత్వానికి, జపాన్‌లోని దౌత్యవేత్తలకు మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలను, నిధికి సంబంధించిన పత్రాలను ఓ ఇంగ్లిష్ మేగజైన్ బయటపెట్టింది. ‘నాకు రక్తం ఇవ్వండి. నేను స్వేచ్ఛను ఇస్తాను’ అంటూ, నేతాజీ చేసిన ప్రకటనతో ఉత్తేజితులైన యువతీ యువకులు భారత జాతీయ సైన్యంలో చేరగా, వీరి పోషణ, ఆయుధాల కొనుగోలు కోసం పెద్దఎత్తున నిధులు అవసరం అయ్యాయి. ఈ క్రమంలో 1945 జనవరి 29న రంగూన్ లో నేతాజీ జన్మదిన వేడుకలు జరుగుతున్న వేళ, ఆయన అభిమానులు తులాభారం వేసి 80 కిలోల బంగారం, నగలను సమర్పించారు. ఆపై రంగూన్ బ్రిటిష్ సైన్యాలవశం కావడంతో నేతాజీ బ్యాంకాక్ కు బయలుదేరారు. నేతాజీ ఆర్మీ ఓడిపోయిన తరువాత, ఆయన అక్కడినుంచి సోవియట్ రష్యాకు వెళ్లేందుకు బయలుదేరి ఆచూకీ లేకుండా పోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బంగారం మొత్తం ఆయన వద్దే ఉంది. టోక్యో సమీపంలో నేతాజీ ప్రయాణిస్తున్న విమానం కూలిపోగా, తీవ్రంగా గాయపడిన ఆయన వద్ద నుంచి 11 కిలోల బంగారాన్ని జపాన్ ప్రభుత్వం తీసుకున్నట్టు సమాచారం. మరి మిగతా బంగారం ఏమయిందన్నది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది.