: ‘శతక’బాదిన షేన్ వాట్సన్... కోల్ కతా లక్ష్యం 200 పరుగులు


ఐపీఎల్ లో నిన్నటిదాకా కాస్త నెమ్మదిగా ఆడిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ (104) వీర విహారం చేశాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో ముంబైలో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కు చెందిన వాట్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టాస్ గెలిచి తొలి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ ఇన్నింగ్స్ ను అజింక్యా రెహానే (37)తో కలిసి ప్రారంభించిన షేన్ వాట్సన్ క్రీజులోకి వచ్చీరావడంతోనే బ్యాట్ ఝుళిపించాడు. కోల్ కతా బౌలర్లకు చుక్కలు చూపాడు. రెహానే ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ (14), సంజూ శాంసన్ (8), జేమ్స్ ఫాల్కనర్ (6), కరుణ్ నాయర్ (16) వెంటవెంటనే వెనుదిరిగినా వెరవని వాట్సన్ బౌండరీల మోత మోగించాడు. మొత్తం 59 బంతులెదుర్కొన్న వాట్సన్ తొమ్మిది ఫోర్లు, ఐదు సిక్సర్లతో చెలరేగి 104 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. వాట్సన్ ఊపుతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. మరికాసేపట్లో 200 పరుగుల విజయలక్ష్యంతో కోల్ కతా బ్యాటింగ్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News