: కర్నూలులో ఏపీ రెండో రాజధాని... మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ డిమాండ్


రాష్ట్ర పునర్విభజన తర్వాత ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలును రెండో రాజధానిగా ప్రకటించాలని టీడీపీ నేత, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ లాంటి చిన్న రాష్ట్రాలకు కూడా రెండు రాజధానులున్నాయని వాదించిన ఆయన, ఏపీకి కర్నూలును రెండో రాజధానిగా ప్రకటిస్తే ఎలాంటి నష్టం లేదని అభిప్రాయపడ్డారు. కర్నూలులో రాయలసీమ పరిరక్షణ వేదిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ నిరాదరణకు గురైందన్నారు. హైదరాబాదును రాజధానిగా పరిగణించి అభివృద్ధి చేస్తే, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణవాదులు తమను తరిమికొడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడైనా రాయలసీమ అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన ఏపీ ప్రభుత్వానికి విన్నవించారు. ఎర్రచందనంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి వచ్చే ఆదాయాన్నంతా రాయలసీమ అభివృద్ధికే మళ్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News