: లేటు వయసులో 'ఘాటు' బాతాఖానీలు... యువతులను ఫోన్లలో వేధించే వారిలో అత్యధికులు వయసు పైబడినవారే!
యువతులకు ఫోన్లు చేసి వేధించేది కుర్రకారే అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. ఫోన్లలో అధికంగా వేధించేది 50 ఏళ్లకు పైబడిన వారేనని ఉత్తరప్రదేశ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అఖిలేష్ సర్కారు మహిళలు ఫిర్యాదులు చేసే నిమిత్తం ఉమెన్ పవర్ లైన్ (1090) ప్రారంభించగా, ఈ నెంబరుకు వచ్చిన ఫిర్యాదుల మేరకు 70 సంవత్సరాలు దాటిన వారు కూడా తెలియని నంబర్లకు ఫోన్లు చేసి మహిళలు రిసీవ్ చేసుకుంటే అసభ్యకరంగా మాట్లాడుతూ వేధిస్తున్నారని తెలుస్తోంది. ఈ నంబరుకు మొత్తం 3.45 లక్షల ఫిర్యాదులు రాగా, అందులో 40 ఏళ్లు దాటిన వారిపై 45 శాతం ఫిర్యాదులు వచ్చాయి. 50 ఏళ్లు పైబడిన వారిపై 5 శాతం ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులు అందిన తరువాత నిందితులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని, ఆ తరువాత కూడా అతనిపై ఫిర్యాదులు అందితే కేసు బుక్ చేస్తున్నామని ఉమెన్ పవర్ లైన్ కార్యకలాపాలు చూస్తున్న అధికారి ఒకరు తెలిపారు.