: కోహ్లీకి మళ్లీ కోపమొచ్చింది!


భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్, ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో బెంగళూరు జట్టు సారధి విరాట్ కోహ్లీకి అసలే కోపం ఎక్కువన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే, నిన్నటి మ్యాచ్ లో ఒక ఇన్నింగ్స్ ముగిసిన తరువాత కోహ్లీకి కోపం ముంచుకొచ్చింది. అంపైర్ కుమార ధర్మసేనతో వాగ్వాదానికి దిగాడు. కోహ్లీకి బెంగళూరు జట్టు కీపర్ దినేష్ కుమార్ సైతం వంతపాడి మైదానంలోనే అంపైర్లతో గొడవకు దిగి పెద్దగా అరిచాడు. అసలేమైందంటే, నిన్న హైదరాబాదులో సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ కి వరుణుడు పలుమార్లు అడ్డుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆటను 11 ఓవర్లకు కుదించారు. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ కు దిగగా, 10వ ఓవర్లో మరోసారి వర్షం మొదలైంది. 11వ ఓవర్ వచ్చే వరకు బాగా కురవడం ప్రారంభమైంది. అంపైర్లు మ్యాచ్ కొనసాగించేందుకే నిర్ణయించారు. బంతి తడిసి చేతికి చిక్కక పోవడంతో కోహ్లీ మిస్ ఫీల్డ్ చేసి నాలుగు పరుగులు సమర్పించుకున్నాడు. వర్షం పడుతుంటే ఆటను ఎందుకు ఆపలేదని ఇన్నింగ్స్ ముగిసిన తరవాత ధర్మసేనతో కోహ్లీ వాగ్వాదానికి దిగాడు. కోహ్లీ, కార్తీక్ లకు మిగిలిన ఆటగాళ్లు, అంపైర్లు సర్దిచెప్పాల్సి వచ్చింది. కాగా, అంపైర్లతో వాగ్వాదాన్ని మ్యాచ్ రిఫరీలు సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. మైదానంలో అంపైర్ల నిర్ణయాన్ని ప్రశ్నించినందుకు వీరిద్దరిపై క్రమశిక్షణా చర్యలకు రంగం సిద్ధమైనట్టు సమాచారం.

  • Loading...

More Telugu News