: డాక్టర్ల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ... పొట్టలో మొబైల్ ఫోన్ పెట్టి ఆపరేషన్
ఆపరేషన్లు చేసేటప్పుడు డాక్టర్లు దూది, దారం వంటి వాటిని శరీరంలోపలే ఉంచి కుట్లు వేసిన ఘటనలు ఎన్నో విన్నాము. మరికొందరు కత్తెరలు కూడా మరచిపోయిన వారున్నారు. కానీ, ఈ లేడీ డాక్టర్ ఏకంగా తన సెల్ ఫోన్ ను కడుపులో ఉంచి ఆపరేషన్ ముగించేసింది. వివరాల్లోకి వెళితే, జోర్డాన్ లో 36 ఏళ్ల హసన్ మహమూద్ అనే యువతి కడుపులో బిడ్డ కాస్తంత అధికంగా ఎదగడంతో, సిజేరియన్ అత్యవసరమైంది. యెమన్ లోని అల్ బషర్ ఆసుపత్రిలో, ఆపరేషన్ తరువాత పండంటి బిడ్డతో ఆమె ఇంటికి చేరిన తరువాత అసలు కథ మొదలైంది. ఆమె కడుపులో వైబ్రేషన్స్ రావడం మొదలై, విపరీతమైన నొప్పి వచ్చింది. దీంతో మరో ఆసుపత్రికి వెళ్లగా, ఎక్స్ రే తీసిన వైద్యులు నోరెళ్లబెట్టారు. ఆమె కడుపులో సెల్ ఫోన్ ఉందని తేల్చారు. ఈ ఘటనపై జోర్డాన్ పార్లమెంటులో సైతం తీవ్ర చర్చ జరిగింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మహిళా వైద్యురాలిపై చర్యలకు అధికారులు ఉపక్రమించారు.