: నా వెనుక నడిచి చూపండి: ఓలా, జొమాటో చీఫ్ లకు రాహుల్ యాదవ్ సవాల్
సుమారు రూ. 200 కోట్ల విలువైన తన వాటాలన్నింటినీ ఉద్యోగులకు ఇచ్చి వార్తల్లో నిలిచిన 'హౌసింగ్ డాట్ కాం' చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ యాదవ్ ఇతర కంపెనీల ఔత్సాహిక సీఈఓలకూ అదే విధంగా చెయ్యాలని సవాల్ విసిరారు. 26 ఏళ్ల ఈ ఐఐటీయన్ ఓలా, జొమాటో చీఫ్ లను ఉద్దేశించి "ఇప్పుడు నేను సవాల్ విసురుతున్నాను. జొమాటో చీఫ్ దీపేందర్ గోయల్, ఓలా చీఫ్ భవిష్ అగర్వాల్ కనీసం సగం వాటాను (మొత్తం కాదు) ఉద్యోగులకు ఇచ్చి ఈ గొప్ప చర్యను కొనసాగించాలి. వీరిద్దరూ వస్తే మరింత మంది ముందడుగు వేయవచ్చు" అని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుపై గోయల్ స్పందిస్తూ 'వావ్... సో క్యూట్' అనగా, అగర్వాల్ 'ఈ మనిషికి (యాదవ్ కు) ఓ కుకీ ఇవ్వండి' అని అన్నారు. యాదవ్ తీసుకున్న నిర్ణయాన్ని కొన్ని స్టార్టప్ కంపెనీల ఉన్నతోద్యోగులు స్వాగతిస్తుండగా, మరికొందరు తన ఆస్తుల వరకూ ఏమైనా చేసుకోవచ్చు. ఇతరుల గురించి ప్రస్తావించడం ఎంత మాత్రం సమంజసం? అని ప్రశ్నిస్తున్నారు. "ఆయనో యువ ఔత్సాహికుడు. ప్రపంచం మారుతోందని భావిస్తున్నాడు. ఆయన సరైన మార్గంలో వెళుతున్నాడో లేదో వేచి చూడాల్సిందే" అని హౌసింగ్ డాట్ కాం సంస్థను ట్రాకింగ్ చేస్తున్న విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించారు.