: ఏపీ, తెలంగాణల మధ్య మరో లొల్లి
రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఏపీ, తెలంగాణల మధ్య ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. ఈ సమస్యలు ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు నెలకొనకుండా, ప్రతిబంధకాలుగా మారాయి. ఈ క్రమంలో, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో కొత్త లొల్లి ప్రారంభం కానుంది. వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి రూ. 8,653 కోట్లు అప్పుగా తీసుకుంది. దీనికి సంబంధించి అసలు చెల్లింపు, వడ్డీల అంశం వివాదాస్పదం కానుంది. వాస్తవానికి జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో రెండు రాష్ట్రాలు పంచుకోవాలి. ప్రతి నెల ఏపీ రూ. 150 కోట్ల చొప్పున వడ్డీ చెల్లిస్తోందట. ఈ క్రమంలో తాము చెల్లించిన మొత్తంలో తెలంగాణ వాటా రు. 600 కోట్లు ఉందని... ఆ వాటా మొత్తాన్ని తమకు బదలాయించాలని తెలంగాణను ఏపీ కోరింది. దీనికి సమాధానంగా, ఉమ్మడి రాష్ట్రం ఖాతాలోకి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రూ. 1,600 కోట్ల నిధులు వచ్చాయని... అందులో తమకు వాటా ఇవ్వలేదని... ముందు ఆ విషయం తేల్చాలని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందట. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల మధ్య మరో లొల్లి తప్పేలా లేదు.