: రాజ్యసభకు జగన్ సోదరి షర్మిల?
వైకాపా అధినేత జగన్ తన బాణాన్ని రాజ్యసభకు ఎక్కుబెట్టారు. సింపుల్ గా చెప్పాలంటే... తన చెల్లెలు షర్మిలను ఆయన రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో ఎంత మేర వాస్తవం ఉందన్నది తెలియాల్సి ఉంది. అక్రమాస్తుల కేసులో జగన్ జైల్లో ఉన్నప్పుడు... పార్టీని జనాల్లోకి తీసుకెళ్లడంలో షర్మిల విజయవంతం అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆమె చేపట్టిన పాదయాత్రకు ఊహించని స్పందన వచ్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే... వైకాపాలో 'సెంటర్ ఆఫ్ అట్రాక్షన్' అయ్యారు. క్రౌడ్ పుల్లర్ గా అవతరించారు. ఇటీవలి కాలంలో తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టడం మినహా... ఆమె క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. ఈ క్రమంలో, ఆమెను రాజ్యసభకు పంపడం ద్వారా, వైకాపాలో క్రియాశీలక పాత్ర పోషించేలా చేయాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు, రాజ్యసభ సీటు కోసం వైకాపాలోని అనేకమంది నేతలు పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికిచ్చినా... మిగిలిన వారు అసంతృప్తికి లోనుకావడం సహజం. ఈ నేపథ్యంలో, షర్మిలను రాజ్యసభకు ఎంపిక చేస్తే... అసమ్మతి సమస్య కూడా ఉండదని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.