: అతనికి మరణశిక్ష పడింది... అయినా దశాబ్దాల పాటు బతుకుతాడట!
అమెరికాపై జరిగిన బాంబు దాడుల్లో ఒకటైన 'బోస్టన్ మారథాన్ దాడి' గుర్తుందా? 2013లో పరుగుల పోటీ జరుగుతున్న వేళ బాంబులు విసిరి ముగ్గురి మరణానికి, 264 మంది గాయపడడానికి కారణమైన దోషి డ్జోహోకర్ త్సర్నయేవ్ కు యోఎస్ ఫెడరల్ కోర్టు మరణదండన విధించింది. విషపు ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా త్సర్నయేవ్ కు మరణశిక్ష అమలు చేయాలని తీర్పిచ్చింది. అయితే, ఈ శిక్ష దశాబ్దాల కాలం పాటు అమలు జరగకపోవచ్చని, అసలు త్సర్నయేవ్ బతికున్నంత కాలం శిక్ష అమలు సాధ్యం కాదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరణదండన అమలుపై మారటోరియం అమలవుతుండడం, శిక్ష పడ్డ మసాచుసెట్స్ లో మరణశిక్షపై నిషేధం ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే శిక్ష తీవ్రతను బట్టి యూఎస్ చట్టాల ప్రకారం మరణశిక్ష విధించారే తప్ప అమలు సాధ్యం కాదని తెలుస్తోంది. అమెరికా ఫెడరల్ వ్యవస్థలో 1988 తరువాత 74 కేసుల్లో మరణశిక్ష విధించగా, కేవలం ముగ్గురికి మాత్రమే శిక్ష అమలు చేశారు. 1995లో ఓక్లహామా నగరంలో ట్రక్ బాంబు పేల్చి 168 మంది మృతికి కారణమైన తిమోతీ మెక్ వెయిగ్ కు 2001లో శిక్షను అమలు చేశారు. ఆ తరువాత మరో ఇద్దరికి శిక్ష అమలు జరిగింది. 2003 తరువాత ఏ ఒక్కరికీ శిక్ష అమలు కాలేదు. దీంతో త్సర్నయేవ్ సైతం దశాబ్దాల పాటు జైల్లో జీవిస్తూనే ఉంటాడని అంటున్నారు.