: మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా ఆకర్షిస్తున్నాయి: మోదీతో చైనా సీఈవోలు
మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి ప్రాజెక్టులు తమను ఆకర్షిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీతో చైనా సీఈవోలు చెప్పారు. 22 మంది చైనా ప్రముఖ సీఈవోలతో ప్రధాని సమావేశమైన వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భారత్ లో పెట్టుబడులకు తాము అనుకూలమని ప్రధానికి చైనా సీఈవోలు చెప్పారని వారు అన్నారు. భారత్ పై తమకు చాలా నమ్మకం ఉందని, అద్భుతమైన నిపుణులు, విస్తారమైన మార్కెట్ భారత్ సొంతమని సీఈవోలు అన్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 'మేకిన్ ఇండియా' అని చెప్పడానికే ఇక్కడికి వచ్చానని ప్రధాని తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆన్ లైన్ దిగ్గజం అలీబాబా అధిపతి 'జాక్ మా' సహా చైనాలోని ప్రముఖ కంపెనీల సీఈవోలు పాల్గొనడం విశేషం.