: విభజన చట్టం అమలయ్యేలా చూస్తా: వెంకయ్యనాయుడు
విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి అంశాన్ని అమలయ్యేలా చూడడమే తన లక్ష్యమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రతి అంశంపైనా కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నానని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయిలో ప్రధాని మోదీ బీమా పథకం ప్రవేశపెట్టారని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రాలకు కేంద్రం 30 శాతం నిధులిచ్చేదని, ఇప్పుడు 49 శాతం నిధులిస్తోందని ఆయన చెప్పారు. భూసేకరణ చట్టంపై వెనక్కు తగ్గేది లేదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. భూసేకరణపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. భూమి కోల్పోయిన రైతులకు నాలుగు రెట్లు నష్టపరిహారం అందజేయనున్నామని ఆయన చెప్పారు.