: మోదీ క్యాపిటలిజానికి రాహుల్ నిర్వచనం
దేశాభివృద్ధి జరగాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా వడ్యాల్ లో ఆయన మాట్లాడుతూ, మోదీ క్యాపిటలిజానికి తాము పూర్తి వ్యతిరేకమని చెప్పారు. మోదీ క్యాపిటలిజం అంటే ఏంటంటే...దేశంలోని ఓ పది మంది పారిశ్రామిక వేత్తలను వెంట పెట్టుకుని, వారి ప్రయోజనాల కోసం పని చేయడమని ఆయన అన్నారు. దానికి తాము పూర్తి వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. దేశం మొత్తం అభివృద్ధి చెందాలంటే పారిశ్రామిక వేత్తలు, రైతులు సమానంగా అభివృద్ధి బాటన పయనించాలని రాహుల్ అభిప్రాయపడ్డారు. ప్రధాని తీరు చూస్తున్న ప్రజలంతా ఆయనకు ఓటేసి తప్పుచేశామని చెబుతున్నారని ఆయన వెల్లడించారు. తానెక్కడికి వెళ్లినా, అక్కడి ప్రజలు ఈ విషయం వెల్లడిస్తున్నారని రాహుల్ చెప్పారు. చివరిగా మండుటెండలో ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.