: బంగ్లా టూర్ కు ఈ నెల 20న టీమిండియా ఎంపిక
ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్ లో పాల్గొనే టీమిండియాను ఈ నెల 20న ఎంపిక చేస్తారని బీసీసీఐ వర్గాలు మీడియాకు తెలిపాయి. ఆ రోజున, బీసీసీఐ జాతీయ సెలెక్షన్ కమిటీ ముంబయిలోని క్రికెట్ సెంటర్ లో సమావేశమై జట్టును ఎంపిక చేస్తుంది. బంగ్లా టూర్ లో భారత జట్టు ఒక టెస్టు, 3 వన్డేలు ఆడుతుంది. వీలైతే ఓ టి20 ఆడే అవకాశాలు ఉన్నాయి. కాగా, టెస్టు క్రికెట్ కు మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంటు ప్రకటించిన నేపథ్యంలో, టెస్టు జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. ఇదిలావుంటే, కోహ్లీతో పాటు మరికొందరు సీనియర్లు ఈ టూర్ కు వెళ్లలేమని, విశ్రాంతి కావాలని బోర్డును కోరినట్టు కథనాలు వస్తున్నాయి. వీటిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక, దేశవాళీ క్రికెట్ సర్క్యూట్లో మార్పులు చేర్పులపై అనిల్ కుంబ్లే నేతృత్వంలోని బీసీసీఐ టెక్నికల్ కమిటీ ఈ నెల 19న సమావేశం కానుంది. రంజీ ట్రోఫీ మ్యాచ్ లలో అధిక శాతం ఫలితాలు వచ్చేందుకు కొన్ని ప్రతిపాదనలను ఈ టెక్నికల్ కమిటీ బోర్డుకు నివేదించనున్నారు. పాయింట్ల ఫార్మాట్, రోజుకు బౌల్ చేయాల్సిన ఓవర్ల సంఖ్య వంటి అంశాలు ఈ ప్రతిపాదనల్లో చోటు చేసుకున్నాయి.