: ఎప్పుడు కావాలంటే అప్పుడు పెంచాం: రాహుల్


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లా వడ్యాల్ లో జరిగిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. అంతకుముందు, ఆయన 15 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అనంతరం, సభకు చేరుకుని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ దేశం కోసం రైతులు, రైతు కూలీలు రక్తం ధారపోస్తారని అన్నారు. దేశ ప్రజలు కడుపునిండా అన్నం తింటున్నారంటే అది రైతన్న చలవేనని అన్నారు. "మనం ఒక్కరోజే ఎండలో నడిచాం... కానీ, రైతు జీవితాంతం ఎండలో నడుస్తాడు. నేను ఒక్కరోజే పాదయాత్ర చేశా... అదే, రైతు కూలీలు రోజూ నడుస్తుంటారు. వారంతా రక్తం ధారపోసి దేశాభివృద్ధికి పాటుపడుతున్నారు. వారిప్పుడు కష్టాల్లో ఉన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. రైతులకు ఏ చిన్న ఆపద వచ్చినా కాంగ్రెస్ ఆదుకునేది. మా పాలనలో 8 లక్షల కోట్ల రుణాలు అందించాం... దానిద్వారా ఆరున్నర కోట్ల రైతులకు లబ్ధి చేకూరింది. 70 వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. బుందేల్ ఖండ్ లో కరవొచ్చినప్పుడు అక్కడి రైతులకు అండగా నిలిచాం. మహారాష్ట్ర కరవు నివారణకు ప్రత్యేక ప్యాకేజీనిచ్చాం. యూపీఏ హయాంలో 7 రెట్లు వ్యవసాయాభివృద్ధి జరిగింది. రైతుకు సాయం చేయడంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుంది. పంటలకు మద్దతు ధర ఎప్పుడు కావాలంటే అప్పుడు పెంచాం. ఇప్పుడు రైతు కరవుతో అల్లాడుతుంటే ప్రస్తుత ప్రభుత్వాలు ఏంచేస్తున్నాయి? ఢిల్లీలో మోదీ ప్రభుత్వం గానీ, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం గానీ ఒక్క ఉద్యోగం అయినా కల్పించాయా? ఉద్యోగాలు కల్పిస్తామంటారు, మేక్ ఇన్ ఇండియా అంటున్నారు... వాస్తవానికి ఏమీ జరగడంలేదు. మంచి రోజులు వస్తాయన్నారు, కానీ, మంచి రోజులు వారికే వచ్చాయి. మోదీ చెప్పిన మంచి రోజుల దేశ ప్రజలకు కాదు... బీజేపీకే. ఢిల్లీలో పెద్ద మోదీ ఉన్నారు, హైదరాబాదులో మినీ మోదీ ఉన్నారు. పేదలకు వారు చేసిందేమీ లేదు. మీలో ఎవరైనా పది లక్షల సూటు వేసుకున్నారా? కానీ, మోదీ పది లక్షల విలువైన సూటు ధరిస్తారు. ప్రధాని వెంట ఎప్పుడూ పారిశ్రామికవేత్తల బృందం విదేశీ పర్యటనలకు వెళుతుంది. వారి ప్రయోజనాలే ఆయనకు ముఖ్యం. రైతుల అంగీకారంతోనే భూములు తీసుకోవాలని మేం చట్టం చేస్తే ఎన్డీయే సర్కారు దాన్ని నీరుగార్చింది. మేం పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, కానీ, రైతులకు నష్టం చేయవద్దని కోరుతున్నాం. రైతులు, పారిశ్రామికవేత్తలు కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాం. ఇక, నాతో పాదయాత్రలో నడిచిన అందరికీ ధన్యవాదాలు" అని ముగించారు.

  • Loading...

More Telugu News